
- సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి: మహేశ్ కుమార్‌గౌడ్
- గ్రేటర్ హైదరాబాద్ లీడర్లు ప్రజల్లోకి వెళ్లాలి
- మూసీ పరీవాహక ప్రాంత పేదల ఇండ్లు కూల్చం
- మూసీపై ప్రతిపక్షాల వైఖరేంటి?
- హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సమీక్ష సమావేశం
హైదరాబాద్, వెలుగు: త్వరలో జరుగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్100 సీట్లు గెలుచుకుంటుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సమీక్ష సమావేశం జరిగింది. అనంతరం గ్రేటర్ పరిధిలోని కాంగ్రెస్ కార్పొరేటర్లతో పీసీసీ చీఫ్ భేటీ అయ్యారు. ఇందులో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథ్, జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాక ర్, పార్టీ సీనియర్ నేత కే కేశవరావు, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసమే ఈ సమీక్షలు నిర్వహి స్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన10 నెలల కాలంలోనే అనేక అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండూ కలిసిపోయాయని, ఆ రెండు పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. త్వరలోనే మిగిలిన ఉమ్మడి జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్ష చేస్తానని చెప్పారు.
ఏ ఒక్క పేద కుటుంబానికి అన్యాయం జరగదు
మూసీ ప్రక్షాళన పేరుతో ఏ ఒక్క పేద కుటుంబానికి అన్యాయం జరగదని, ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరి అని మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు దళారుల అవతారం ఎత్తి విచ్చలవిడిగా చెరువులు, కుంటలను కబ్జా చేశారని ఆరోపించారు. అలాంటి వారి పేర్లను త్వరలోనే బయటపెడ్తామని చెప్పారు. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాల వైఖరి ఏంటని ప్రశ్నించారు. వారు ప్రక్షాళనను కోరుకుంటున్నారా? లేదా? అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు పదవులు ఇస్తామని, రాబోయే రోజుల్లో కార్యకర్తలందరికీ తగిన న్యాయం చేస్తామని చెప్పారు.
దీపాదాస్ హామీతో వెనక్కి తగ్గిన ఎమ్మెల్యేలు
కొండా సురేఖపై ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌కు ఫిర్యా దు చేయాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే లు బుధవారం చేసిన ప్రయత్నాలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ చెక్ పెట్టారు. వారితో మాట్లాడిన ఆమె, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. కొంత సమయం ఇవ్వాలని, అప్పటికీ పరిష్కారం కాకపోతే ఢిల్లీకి వెళ్లండని చెప్పడంతో ఎమ్మెల్యేలు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. కాగా, రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలంటే పార్టీ నేతలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని దీపాదాస్ మున్షీ పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ కార్పొ రేటర్ల మీటింగ్‌లో పాత, కొత్త నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరుపై కార్పొరేటర్ విజయారెడ్డి ఫైర్ అయ్యారు. ఖైరతాబాద్ నియోజ కవర్గంలో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ప్రొటోకాల్ పాటించడం లేదని ఆమె పీసీసీ చీఫ్ ముందే తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. దీంతో మేయర్ విజయలక్ష్మి తీవ్రంగా స్పందించడంతో మీటింగ్‌లో కాసేపు గందరగోళం నెలకొన్నది. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
వరంగల్ వివాదానికి అక్కడే ఫుల్‌స్టాప్
కాంగ్రెస్ లో కొందరు కార్యకర్తల అత్యుత్సాహంతో సమస్యలు ఏర్పడుతున్నాయని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు పీసీసీ చీఫ్ ను హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్ లో కలిశారు. దీనిపై మహేశ్ స్పందిస్తూ.. ఆ జిల్లా సమస్యలను అక్కడే పరిష్కరించుకుంటామన్నారు. ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. ఈ సమస్యకు త్వరలోనే ఫుల్‌స్టాప్ పడుతుందని చెప్పారు.